జబర్దస్త్‌లో ఆమె మహానటి.. ఎమ్మెల్యే రోజాపై నన్నపనేని సెటైర్లు

ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జబర్దస్త్‌లో రోజా మహానటని.. నిజజీవితంలోనూ చాలా అద్భుతంగా నటిస్తోందంటూ ఎద్దేవా చేశారు. జై అమరావతి అనాలని రైతులు అడ్డుకుంటే.. రోజా డీజీపీకి ఫోన్‌ చేసిందనని విరుచుకుపడ్డారు. జై అమరావతి అనడానికి ఇబ్బందేంటని ధ్వజమెత్తారు నన్నపనేని. సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను ఎలా సర్వే చేస్తారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్వేను అడ్డుకున్నందుకుక 426 మంది రైతులపై కేసులు పెట్టారన్నారని.. కేసులు పెట్టాల్సింది రైతులపై కాదు.. దొంగదారిన వస్తున్న అధికారులపై పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వస్తే ఏ సంతకాలూ సూచించారు నన్నపనేని రాజకుమారి.

గురువారం వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి రైతుల నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. అయితే రోజా వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు... అక్కడికి చేరుకున్నారు. సమ్మిట్ జరుగుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఆందోళనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న కొందరు మహిళా ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.